: ఖరీదైన బంగళాలు, ఫామ్ హౌస్ లు, కాపలా కుక్కలు... రాంజీనగర్ దొంగల రాజభోగం!


తమిళనాడులోని పెరంబదూర్ జిల్లాలోని రాంజీనగర్ లో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. అందుకేనేమో, 700 గడపలున్న ఆ గ్రామంలో 650 కుటుంబాలు చోరకళలోకి దిగిపోయాయి. చోరీల్లో వీరి తీరు వినూత్నం. రోడ్డుపై రూ.10 నోటు వేసి బాధితుల దృష్టిని మరల్చడం, వెనువెంటనే డబ్బుల సంచులతో ఉడాయించడం వీరి ప్రత్యేకత. హైదరాబాదులోని సికింద్రాబాదు రైల్వే స్టేషన్, పంజాగుట్టల్లో ఈ ముఠా ఇటీవల రెండు చోరీలకు పాల్పడింది. నాలుగేళ్ల వ్యవధిలో హైదరాబాదులో రూ.6 కోట్ల మేర నగదు, నగలను ఈ ముఠా అపహరించింది. ఇక దేశవ్యాప్తంగానూ ఈ ముఠా చేతివాటం ప్రదర్శిస్తోంది. వీరికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు రాంజీనగర్ వెళ్లి చోరుల జీవన శైలి చూసి షాకయ్యారట. తొలుత అందరితో కలిసి గ్రామంలోనే ఉన్న చోరులు, భారీ ఎత్తున డబ్బు సమకూరడంతో సమీపంలోని వందెకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులోనే అధునాతన భవంతులను నిర్మించుకున్నారు. ఒక్కో భవంతి ఎంత లేదన్నా, రూ.50 లక్షల విలువ చేస్తుందట. మిగిలిన డబ్బుతో వీరు ఏకంగా ఫామ్ హౌస్ లనే కొనుగోలు చేశారు. పెరంబదూర్ లోని 20 ఫామ్ హౌస్ ల దాకా వీరివేనట. ఇక రాత్రి వేళల్లో ఇళ్ల వద్ద పోలీసుల భయం లేకుండా నిద్రించేందుకు వీరు కాపలా కుక్కలను వినియోగిస్తున్నారు. తోడేళ్ల మాదిరి ఉండే సదరు కుక్కలు, అపరిచితులను వెంటాడి, వేటాడతాయట. ఈ విషయాలన్నీ తెలిసిన ఓ ఇన్ స్పెక్టర్ పూజారి వేషం వేసుకుని వెళ్లగా, అనుమానం వచ్చిన దొంగలు ఆయనను పెరంబదూర్ వరకు వెంబడించారు. ఇదే అదనుగా భావించిన సదరు ఇన్ స్పెక్టర్ పోలీసులకు ఫోన్ చేసి వారిని అరెస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News