: సమోసాలు లాగించండి... ఆరోగ్యానికి ఏమీ కాదు: కేజ్రీకి రాష్ట్రపతి సలహా!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్యం బారిన పడ్డారు. కేజ్రీ ఇబ్బందికర పరిస్థితిని గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ మంచి సలహా పడేశారు. బెంగళూరు వెళ్లి వైద్యం తీసుకోమని సలహా ఇవ్వడమే కాక, సదరు వైద్యుడికి మోదీనే స్వయంగా ఫోన్ చేసి మరీ సిఫారసు చేశారు. బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టారు. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేజ్రీవాల్ ను పలకరించారు. అంతేకాదండోయ్, సమోసాలు లాగించమని, ఆరోగ్యానికేమీ కాదని కూడా ఆయన భరోసా ఇచ్చారు. నిన్న పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్ లో ప్రముఖులకు ప్రణబ్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్న సమోసాను తింటున్న కేజ్రీవాల్ దగ్గరకు వచ్చిన ప్రణబ్ ‘‘అదేంటీ, తక్కువ తింటున్నారు. కాస్త గట్టిగానే లాగించండి. ఆరోగ్యానికి ఏమీ కాదు’’ అంటూ సరదాగా సలహా ఇచ్చారు.