: భారీ భద్రత అక్కర్లేదు... యూపీ ఖాకీలకు షాకిచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ పారికర్


గోవా సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత మనోహర్ పారికర్ ను ఆ పదవికి రాజీనామా చేయించి మరీ ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ లో చేర్చుకున్నారు. కేంద్ర కేబినెట్ లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అప్పగించారు. మనోహర్ పారికర్ లో మోదీకి నచ్చిన విషయమేంటంటే, సింప్లిసిటీనేనట. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఘటన నిన్న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. కాన్పూర్ లో నిన్న జరిగిన కార్యక్రమానికి హాజరైన పారికర్ కు యూపీ పోలీసులు భారీ భద్రత కల్పించారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు పెద్ద సంఖ్యలో భద్రతా వాహనాలను అక్కడికి తరలించారు. అయితే వాటన్నింటినీ పారికర్ తిప్పిపంపారు. ‘‘ఇన్ని వాహనాలు ఎందుకు? నా భద్రత కోసం ఒక్క వాహనం చాలు. నా వెనుక ఇన్ని వాహనాలు వస్తే, ప్రజలకు ఇబ్బందేగా? ఒక్క వాహనాన్ని ఉంచి మిగిలిన వాటిని వెనక్కు పంపండి’’ అంటూ ఆయన చెప్పడంతో యూపీ పోలీసులు నోరెళ్లబెట్టారు. అయినా ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు పారికర్ కు నచ్చజెప్పేందుకు యత్నించారట. అయినా ససేమిరా అన్న పారికర్ కేవలం ఒక్క వాహనంలో భద్రత సిబ్బందిని మాత్రమే తన వెంట అనుమతించారు.

  • Loading...

More Telugu News