: పట్టుకుని మరీ కాల్చేశారట... తమిళ పోలీసులకు 'చావు' తప్పిన కూలీల ఫిర్యాదు!
శేషాచలం అడవుల్లో రెండు రోజుల క్రితం కలకలం సృష్టించిన ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ కౌంటర్ సందర్భంగా ఆఖరి నిమిషంలో ఇద్దరు కూలీలు ఏపీ పోలీసుల బారి నుంచి తప్పించుకున్నారు. వీరిలో వేలూరు జిల్లా పుదూరునాడుకు చెందిన మురళి అనే కూలీ ఉన్నాడు. ఏపీ పోలీసుల బారి నుంచి తప్పించుకుని స్వగ్రామం చేరుకున్న అతడు, ఆ తర్వాత ఏపీ పోలీసుల మారణకాండపై తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు నుంచి శేషాచలం అడవుల్లోకి వెళ్లేందుకు బయలుదేరిన కూలీలను చిత్తూరు జిల్లా గుడిపాల మండల సరిహద్దులో గత నెల 30న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడే ఓ చిన్న ఇంటిలో వారిని బంధించారు. మురళి వెళ్లేసరికే అక్కడ 145 మందికి పైగా కూలీలున్నారు. ఈ నెల 7న తెల్లవారుజామున కూలీలను పోలీసులు శేషాచలం అడవుల్లోకి తరలించారు. అనంతరం ఎంపిక చేసిన 20 మందిని పోలీసులు కాల్చివేశారు. ‘‘ఎర్రచందనం చెట్లు నరికేందుకు వస్తే, ఇదే గతి పడుతుంది’’ అంటూ పోలీసులు హెచ్చరించారట.