: మీడియా తప్ప అంతా అంగీకరిస్తారు: అశోక్ గజపతిరాజు
తన వల్ల విమానానికి ప్రమాదం ఉండదని అందరూ అంగీకరిస్తారు, కానీ మీడియా మాత్రం అంగీకరించదని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తనకు సిగిరెట్ తాగే అలవాటు ఉందని అన్నారు. ఆ అలవాటు కారణంగా జేబులో అగ్గిపెట్టె కానీ, సిగరెట్ లైటర్ కానీ ఉంచుకుంటానని అన్నారు. తాను విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గమనించిన తేడా ఏంటంటే...మామూలుగా ఉన్నప్పుడు మొత్తం చెక్ చేసేవారని, విమానయాన శాఖ మంత్రి అయిన తరువాత చెకింగ్ తీవ్రత తగ్గిందని ఆయన చెప్పారు. అయినప్పటికీ తాను విమానాశ్రయానికి గంట ముందే చేరుకుంటానని ఆయన వెల్లడించారు. అయితే తనవల్ల విమానానికి ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రపంచానికి తెలుసు కానీ, మీడియాకి మాత్రం తెలియదని ఆయన చెప్పారు. తనకు ఉన్నదున్నట్టు సూటిగా చెప్పడం తెలుసని, అబద్ధాలు మాట్లాడనని ఆయన తెలిపారు.