: లండన్ లో 1860 కోట్ల భారీ దోపిడీ


లండన్ లోని హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఈస్టర్ సెలవులను ఉపయోగించుకున్న దొంగలు, బ్యాంకును లూటీ చేసేశారు. క్యాథలిక్కులకు పవిత్రమైన పెద్ద గురువారం రోజున బ్యాంకు పైకప్పును కత్తిరించి లోపలికి చొరబడ్డ దొంగలు, 300 సేఫ్ డిపాజిట్ లాకర్ బాక్సులు తెరచి, వాటిలోని వజ్రాలు, నగలు, నగదు దోచుకుని ఉడాయించారు. లాకర్ బాక్సులు తెరిచేందుకు అత్యాధునిక కటింగ్ యంత్రాలు ఉపయోగించినట్టు పోలీసులు వెల్లడించారు. సెలవులు ముగియడంతో బ్యాంకుకు వచ్చిన సిబ్బందికి ఖాళీ లాకర్లు దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోయి, పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ఎత్తుకుపోయిన వాటిలో 50 లక్షల విలువైన వజ్రం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఎంత మొత్తం పోయింది? అనేదానిని ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చే సమస్యలు దృష్టిలో పెట్టుకుని, ఖాతాదారులు వెల్లడించడం లేదని సమాచారం. అయితే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. బ్యాంకు అధికారులు వెల్లడించిన ప్రకారం దాదాపు 1860 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, నగలను ఎత్తుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. కాగా, బ్యాంకులో ఉండే అలారం ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తే, శుక్రవారం నుంచి పనిచేయడం లేదని, అప్పుడే దొంగలు లాకర్లు తెరిచేందుకు కటింగ్ యంత్రాలు ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, దోపిడీ గురించి తెలిసిన ఖాతాదారులు, బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన ప్రారంభించారు. అలారం వ్యవస్థను ఎందుకు తనిఖీ చేయలేదని సెక్యూరిటీని ప్రశ్నిస్తే, తనకు తక్కువ జీతం ఇస్తున్నారని దానిని పట్టించుకోలేదని సదరు గార్డు చెప్పాడట. దీంతో బ్యాంకు ఉద్యోగులే దొంగలతో కుమ్మక్కయ్యారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. కాగా, సీసీ టీవీ పుటేజ్ ను కూడా దొంగలు ఎత్తుకుపోవడం ఇందులో ట్విస్టు.

  • Loading...

More Telugu News