: దశాబ్దాల అనంతరం సమ్మెకు దిగిన రైల్వే సిబ్బంది
బెంగళూరులో రైల్వే ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దశాబ్దాల అనంతరం రైల్వే శాఖలో జరిగిన ఈ సమ్మెతో పలు రైళ్లు ఎక్కడికక్కడ పట్టాలపై ఆగిపోగా, సుమారు 8 వేల మంది ప్రయాణికులు రెండు గంటలకు పైగా ప్లాట్ ఫాంలపై అవస్థలు పడ్డారు. ఒక రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సమస్య మొదలైంది. అతనికి మిగతా అన్ని యూనియన్ల ఉద్యోగులు మద్దతు పలికి అతన్ని తక్షణం విడిచి పెట్టాలంటూ సమ్మెకు దిగారు. ఈ మెరుపు సమ్మె నిన్న సాయంత్రం 6:20 నుంచి రాత్రి 8:15 గంటల వరకూ కొనసాగింది. బెంగళూరు పరిధిలోని 188 రైల్వే స్టేషన్లలో కంట్రోల్ సిస్టంలు సహా కార్యకలాపాల ఆగిపోయాయి. చివరికి రైల్వే మంత్రిత్వశాఖ కల్పించుకోవడంతో సమస్య సద్దుమణిగింది. బెంగళూరులోని యశ్వంతపూర్, కంటోన్మెంట్, వైట్ ఫీల్డ్, తదితర ప్రధాన స్టేషన్లలో రాజధాని సహా పలు ఎక్స్ ప్రెస్, లోకల్ రైళ్లకు అంతరాయం కలిగింది.