: బైక్ పై శేషాచలం కొండల్లోకి చెవిరెడ్డి...ఎన్ కౌంటర్ ను ప్రత్యక్షంగా పరిశీలించిన వైనం
వైసీపీ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఏ పని చేసినా విభిన్నంగానే ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకునేందుకు మీడియా ప్రతినిధులు నానా తంటాలు పడ్డారు. అయితే తన నియోజకవర్గంలో జరిగిన ఎన్ కౌంటర్ ను ప్రత్యక్షంగా పరిశీలించాలని చెవిరెడ్డి నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అడవుల్లోకి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఘటనా స్థలం వద్దకు కారు వెళ్లదని పోలీసులు తేల్చిచెప్పారు. అయినా వినని, చెవిరెడ్డి బైక్ పై బయలుదేరారు. తన సహచరుడు బైక్ నడిపితే, వెనుక కూర్చుని ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్ కౌంటర్ లో చెల్లాచెదురుగా పడి ఉన్న కూలీల మృతదేహాలను పరిశీలించారు.