: రాంచీలో ట్రాఫిక్ నిబంధన ఉల్లఘించారంటూ ధోనీకి జరిమానా
ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించారంటూ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి రాంచీ ట్రాఫిక్ ఫోలీసులు రూ.450లు జరిమానా విధించారు. ధోనీ మోటార్ సైకిల్ కు ముందువైపు నెంబర్ ప్లేట్ అడ్డంగా ఉండాల్సింది, బైక్ వీల్ మడ్ గార్డ్ పై ఉందని రాంచీ పోలీస్ అధికారి తెలిపారు. దాంతో మోటార్ వెహికల్ చట్టం నిబంధనలను ధోనీ ఉల్లంఘించినట్టు రాంచీ ట్రాఫిక్ పోలీస్ సూపరింటెండెంట్ కార్తీక్ ధ్రువీకరించారు. "రాష్ట్ర రాజధానిలో రిజిస్టర్ కాని, మిస్సింగ్ నెంబర్ ప్లేట్స్ పై ఓ డ్రైవ్ ప్రారంభించాం. ఈ నేపథ్యంలో ధోనీ బుల్లెట్ కు నెంబర్ ప్లేట్ సరిగా ఉంచలేదని గుర్తించాం. ఈ క్రమంలో అతనికి జరిమానా విధించాం" అని ట్రాఫిక్ ఎస్ పీ చెప్పారు. వెంటనే సంబంధిత అధికారి ధోనీ ఇంటికి వెళ్లి జరిమానా రిసిప్ట్ ఇచ్చారని, తరువాత ధోనీ తండ్రి పాన్ సింగ్ జరిమానా చెల్లించారని ట్రాఫిక్ ఎస్పీ కార్తీక్ వెల్లడించారు.