: అగ్గిపెట్టె వివాదంపై అనవసర రాద్ధాంతం చేశారు: అశోక్ గజపతిరాజు
తాను విమానం ఎక్కినప్పుడల్లా అగ్గిపెట్టె తీసుకువెళుతుంటానని, అలాగని దాంతో విమానం హైజాక్ చేసే వీలుంటుందా? అంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. దానిపై మీడియాలో పలురకాలుగా వార్తలు రావడంతో మంత్రి స్పందిస్తూ, అగ్గిపెట్టె వివాదంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తన అభిప్రాయాన్ని వక్రీకరించడం సరికాదని, కేంద్ర మంత్రులను కూడా తనిఖీ చేయాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల భద్రతపై అమెరికా ప్రతినిధితో చర్చించామని భద్రత కేటగిరీ 2 నుంచి 1కి చేరడం శుభపరిణామమన్నారు. ఈ మేరకు ఢిల్లీలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, గన్నవరం ఎయిర్ పోర్టును విస్తరించాల్సిన అవసరముందని, ఆ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అవి పూర్తయ్యాక గన్నవరంలో టెక్నాలజీ, సర్వీసులు పెంచుతామన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు కావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇక ఏపీ నూతన రాజధాని అమరావతిలో ఎయిర్ పోర్టుపై మాస్టర్ ప్లాన్ తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.