: హిందూ డ్రైవర్ మాత్రమే కావాలి... ఓలా క్యాబ్స్ కు హైదరాబాదీ వినతి... నిరాకరించిన ఓలా
తనను పికప్ చేసుకునేందుకు హిందూ మతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ మాత్రమే కావాలని ఒక కస్టమర్ చేసిన విజ్ఞప్తిని ఓలా క్యాబ్స్ తిరస్కరించింది. ట్విట్టర్ వేదికగా, శీలం వీరప్పనాయుడు అనే కస్టమర్ తనకు టాక్సీ కావాలని కోరుతూ, హిందూ డ్రైవర్ ను పంపాలని కోరాడు. మరో 6 నిమిషాల తరువాత 'మతం ప్రాతిపదికన మా డ్రైవర్లపై వివక్ష చూపలేము' అని ఓలా క్యాబ్స్ సమాధానం ఇచ్చింది. ఈ పోస్ట్ సామజిక మాధ్యమాల్లో 700 సార్లు రీట్వీట్ అయింది. విమానం, బస్సు ఎక్కినప్పుడు కూడా ఇలాగే అడుగుతావా? హోటల్ కు పోతే వంటవాళ్ళ మతాలు తెలుసుకుంటావా? అంటూ వీరప్పనాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. తాను వివక్ష చూపాలని చెప్పడంలేదని, కస్టమర్ ప్రాధాన్యతగా చూడాలన్నది తన అభిమతమని, ఎవరినీ బాధించాలని తాను అనుకోలేదని వీరప్పనాయుడు చెప్పాల్సి వచ్చింది.