: బెజవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్... వేగంగా పనులు!
రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని నుంచే కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వ భవనం, లేదంటే ప్రైవేట్ భవనమైనా ఫరవాలేదంటూ ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన కృష్ణా జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్లు బెజవాడలోని జలవనరుల శాఖ కార్యాలయాన్ని ఎంపిక చేశారు. సదరు కార్యాలయంలో సీఎం చాంబర్ తో పాటు సీఎంఓ అధికారులకు గదులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు పనులు పూర్తి కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే నెల తొలివారంలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా వేగం పుంజుకున్నాయి. మరోవైపు బెజవాడలోని ఆఫీసర్స్ క్లబ్ భవనంలో ఏపీ డీపీజీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు కానుంది.