: అద్వానీకి మరోమారు అవమానం... బీజేపీ వ్యవస్థాపక దినోత్సవానికి అందని ఆహ్వానం!
లాల్ కృష్ణ అద్వానీ... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో అగ్రగణ్యుడు. పార్టీకి జీవం పోసి, కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి పార్టీని తీసుకురావడంలో కీలక భూమిక ఆయనదే. అందుకోసం ఆయన సుదీర్ఘ రథయాత్రను చేశారు. చరిత్రపుటల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం మలితరం నేతలు పార్టీని నడుపుతుండగా, కురువృద్ధుడి హోదాలో పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. అయితే ఆయనకు పార్టీ నేతల నుంచి అవమానాల పరంపర ఎదురవుతూనే ఉంది. మొన్నటికి మొన్న బెంగళూరులో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తనకు ప్రాధాన్యమివ్వకపోవడంతో అలిగిన ఆయన, ప్రసంగించేందుకు ససేమిరా అన్నారు. తాజాగా పార్టీ 35వ వ్యవస్థాపక దినోత్సవం నిన్న అంగరంగ బైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ప్రధాని స్థాయి నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అయితే అద్వానీ ఎక్కడా కనిపించలేదు. ఎందుకని ఆరా తీస్తే, వ్యవస్థాపక దినోత్సవాల్లో పాల్గొనాలని ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదని తెలిసింది. ఆహ్వాన పత్రిక కాకున్నా, కనీసం టెక్ట్స్ మెసేజ్ కూడా అందలేదని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు