: నటుడు సైఫ్ అలీఖాన్ కు కోర్టు వార్నింగ్... తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఎన్ ఆర్ఐ వ్యాపారిపై దాడి కేసులో తదుపరి విచారణకు జూన్ 18న హాజరు కావాలంటూ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ముంబయి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని, ఈసారి విచారణకు హాజరుకాకుంటే వారెంట్ జారీ చేస్తామని కోర్టు హెచ్చరించింది. దాడి కేసులో నిన్న (సోమవారం) న్యాయస్థానం ముందుకు రావల్సి ఉన్నప్పటికీ సైఫ్ గైర్హాజరయ్యాడు. తాను షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నానని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన తరపు న్యాయవాది ద్వారా అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయించాడు. దానిపై అభ్యంతరం తెలిపిన ప్రాసిక్యూటర్ వాజిద్ షేక్... సైఫ్ పై బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ శంకర్ దభడే సైఫ్ కు తుది అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 22, 2012లో ముంబయిలోని తాజ్ హోటల్ లో ఇక్బాల్ మిర్ శర్మా అనే ఎన్ఆర్ఐ వ్యాపారిపై సైప్ దాడి చేశాడు. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైఫ్ అతని ఇద్దరు స్నేహితులు అరెస్టై తరువాత విడుదలయ్యారు. ఈ ఘటనకు సంబంధించన కేసులోనే ప్రస్తుతం విచారణ జరుగుతోంది.