: ఐపీఎల్ మ్యాచ్ లకు తెలుగు కామెంటరీ... ‘కిక్స్’తో సోనీ శ్రీకారం!
క్రికెట్ అంటే విద్యావంతులతో పాటు అందరికీ ఆసక్తే. వరల్డ్ కప్ లాంటి అంతర్జాతీయ టోర్నీ మ్యాచ్ లపై నానాటికీ ఆసక్తి పెరిగిపోతోంది. అలాంటిది ‘స్థానిక’ ఫ్లేవర్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లంటే మరింత ఆసక్తే. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లపై పట్టణ ప్రాంతాల్లోనే కాక గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటమే కాక హిందీ, ఆంగ్ల అర్థం కాని వారు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. పరబాషల కామెంటరీతో కొన్ని కీలక సందర్భాల్లో ఏం జరిగిందన్న విషయం అర్థం కాక తికమకపడుతున్న వారు చాలామందే ఉన్నారు. ఇకపై ఆ అయోమయం ఎంతమాత్రం అవసరం లేదు. ఇతర భాషల గురించి ఏమాత్రం తెలియని వారు కూడా మ్యాచ్ లో ప్రతిక్షణాన్ని ఆస్వాదించే వెలసుబాటును ‘సోనీ’ టీవీ కల్పిస్తోంది. ‘సోనీ కిక్స్’ పేరిట కొత్త ఛానెల్ ను ప్రసారం చేయనున్న సోనీ, ఐపీఎల్-8 మ్యాచ్ ల కామెంటరీని తెలుగులోనూ అందించనుంది. క్రికెట్ అంటే మక్కువ చూపే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని సోనీ సిక్ప్, కిక్స్ ఛానెళ్ల బిజినెస్ హెడ్ ప్రసన్న కృష్ణన్ చెబుతున్నారు.