: మోదీ దుర్యోధనుడు...కురుక్షేత్రం తప్పదు: జైరాం రమేష్
భూసేకరణ బిల్లును అడ్డుకునేందుకు మరోసారి మహాభారత యుద్ధం చేయడానికి కూడా వెనుకాడమని మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. భువనేశ్వర్ లో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దుర్యోధనుడిలా వ్యవహరిస్తూ రైతులు, గిరిజనుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచేందుకు నిధులు సమకూర్చిన కార్పొరేట్ కంపెనీల రుణం తీర్చుకునే ప్రయత్నంలో, దేశ ప్రజల పొట్టగొట్టేందుకు భూసేకరణ చట్టానికి సవరణలు చేపట్టారని ఆయన ఆరోపించారు. 2013లో సవరించిన భూసేకరణ చట్టానికి రెండేళ్లలోనే మార్పులు చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. దుర్యోధనుణ్ని ఓడించేందుకు పాండవుల మాదిరిగా తాము పోరాడుతున్నామని, తమతో ఇతర పార్టీలు కూడా కలిసి రావాలని ఆయన సూచించారు. ఈ బిల్లును వ్యతిరేకించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు ఆయన పిలుపునిచ్చారు.