: నన్ను ఇబ్బంది పెట్టడానికే ఉద్యోగులకు ఫిట్ మెంట్ పెంచారు: చంద్రబాబు
తనను ఇబ్బంది పెట్టేందుకే తెలంగాణ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ పెంచారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తిరుపతిలో ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో నడుస్తోంది. ఈ సమయాన్ని చూసుకుని ఉద్యోగులకు తాయిలాలు ప్రకటించారు. అయితే ఎన్జీవోలు చేసిన పోరాటం దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారికి 42 శాతం ఫిట్ మెంట్ పెంచి తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేరని నిరూపించానని బాబు తెలిపారు. ఉద్యోగులు సహకారంతో రాష్ట్రాన్ని అద్భుతరీతిన నిర్మించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.