: జగన్ కు ఝలక్... పట్టిసీమకు మద్దతుగా గళమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఝలకిచ్చారు. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నదీ జలాలను మళ్లించడం ద్వారా రాయలసీమ నీటి అవసరాలు తీర్చేందుకంటూ పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. అయితే ఏళ్ల క్రితం ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టును వదిలి కొత్త ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు నిధుల దోపిడీకి తెర తీశారని జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పార్టీ అధికార పక్షాన్ని అడుగడుగునా అడ్డుకుంది. ఢిల్లీ వెళ్లిన జగన్, కేంద్రానికి కూడా చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. తన తాబేదారైన కాంట్రాక్టర్ కోసమే చంద్రబాబు పట్టిసీమను ప్రతిపాదిస్తున్నారని జగన్, మోదీ సర్కారు వద్ద మొరపెట్టుకున్నారు. అయితే పట్టిసీమ ప్రాజెక్టు రాయలసీమకు తప్పనిసరి అని జమ్మలమడుగు ఎమ్మెల్యే, జగన్ పార్టీ నేత ఆదినారారణ రెడ్డి గళం విప్పారు. పట్టిసీమ పూర్తైతే, రాయలసీమ రతనాల సీమ అవుతుందని ఆయన వాదిస్తున్నారు. రాయలసీమలో ప్రత్యేకించి జమ్మలమడుగులోని పలు ప్రాజెక్టులు నిండుతాయని ఆయన చెప్పారు. తద్వారా సాగు నీటికే కాక తాగు నీటికీ కొరత ఉండదని ఆయన వాదిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.