: కేజ్రీ... ఆరోగ్యం మెరుగుపడిందా?: ఢిల్లీ సీఎంకు చంద్రబాబు ఆత్మీయ పలకరింపు!
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో నిన్న ఢిల్లీలో ప్రారంభమైన న్యాయ సదస్సులో ఏపీ, ఢిల్లీ సీఎంలు నారా చంద్రబాబునాయుడు, అరవింద్ కేజ్రీవాల్ ల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సమావేశానికి ఒకరిద్దరు మినహా అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరైనా, అందరిలోకి చంద్రబాబు ఉత్సాహంగా కనిపించారు. దాదాపు 15 మందికి పైగా సీఎంలను ఆయన స్వయంగా పలకరించారు. సదస్సులో భాగంగా తొలి సెషన్ ముగియగానే టీ బ్రేక్ లో చంద్రబాబుతో పాటు కేజ్రీవాల్ 'సెంటర్ ఆఫ్ అట్రాక్షన్'గా నిలిచారు. పలువురు ఉన్నతాధికారులు, ఇతర నేతలు వీరితో ఫొటోలు దిగేందుకూ ఆసక్తి కనబరిచారు. కొద్దిసేపటికే చంద్రబాబు, కేజ్రీవాల్ లు పరస్పరం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ‘‘కేజ్రీవాల్, మీ ఆరోగ్యం మెరుగుపడిందా? ఇప్పుడెలా ఉంది?’’ అంటూ చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ‘‘ఇప్పుడు బాగానే ఉంది. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను’’ అన్నారు. దీనికి ప్రతిస్పందించిన చంద్రబాబు ‘‘తప్పకుండా కలుద్దాం’’ అంటూ బదులిచ్చారు.