: నల్గొండలో తీవ్రవాదులకు సహకరించారా?


నల్గొండ జిల్లాలో తీవ్రవాదులకు సహాయసహకారాలు అందాయా? అవుననే అంటున్నాయి యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందాలు. జానకీపురం పరిసరాల్లో ఎన్ కౌంటర్ అయిన తీవ్రవాదుల తీరుతెన్నులు వారికి ఎవరో సహకరించారన్న అనుమానాన్ని బలపరుస్తున్నాయి. తీవ్రవాదులు రెండు రోజులపాటు నల్గొండ జిల్లా పరిసరాల్లోనే ఉండడం ఒకటి కాగా, మరణిస్తూ 'డూ ఆర్ డై' అంటూ చేసిన నినాదాలు కొత్త ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా పోలీసులు, భద్రతాదళాలపై తీవ్రవాదులు గుంపుగా విరుచుకుపడతారు. ఆ సమయంలో వారు గంభీరంగా ఉంటారట. దాడికి ముందే వారిని వారు ఉత్తేజపరచుకుంటారట. అయితే నల్గొండ జానకీపురంలో ఎన్ కౌంటర్ లో బలైన ఉగ్రవాదులు బిగ్గరగా 'డూ ఆర్ డై' అంటూ నినాదాలు చేశారట. ఈ లెక్కన వారు చేసిన నినాదాలు ఏదైనా కోడ్, లేక తమకు సహకరించిన వారికి దిశానిర్దేశం చేసే నినాదాలని యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ భావిస్తోంది. దీంతో నల్గొండ జిల్లా జానకీపురం పరిసరాల్లో స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయా? అనే అనుమానం రేగుతోంది. ఒకవేళ అదే జరిగితే మరింత పెనుముప్పు పొంచి ఉందనే అనుకోవాలి. ఇకపోతే మూడవ వ్యక్తికి చెందిన రైలు టికెట్. ఈ టికెట్ ఎవరు కొన్నారు? వారు ఇక్కడే ఉన్నారా? తలదాచుకునేందుకు ఇంకెక్కడికైనా వెళ్లారా? అనే అనుమానాలు రేగుతున్నాయి. దీంతో పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ బృందాలు లోతుగా పరిశోధిస్తున్నాయి.

  • Loading...

More Telugu News