: నాగరాజు అంతిమ యాత్ర ప్రారంభం... హాజరైన పోలీసు ఉన్నతాధికారులు
సూర్యాపేట షూటర్స్ ఎన్ కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ నాగరాజు అంతిమయాత్ర అతడి స్వగ్రామం రసూల్ గూడలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. నిన్న ఉదయం మూడున్నర గంటల పాటు జరిగిన ఉత్కంఠ ఆపరేషన్ లో పది కిలో మీటర్ల మేర వెంబడించిన నాగరాజుపై దుండగులు అదను చూసి దాడి చేశారు. దుండగుల దాడిలో నాగరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నల్గొండ జిల్లా రసూల్ గూడకు చెందిన నాగరాజుకు ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. నాగరాజు మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొద్దిసేపటి క్రితం మొదలైన నాగరాజు అంతిమయాత్రకు జిల్లా ఎస్పీ ప్రభాకరరావుతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అధికారిక లాంఛనాల మధ్య కాసేపట్లో నాగరాజు భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.