: నల్గొండ పోలీసులకు జేజేలు... వారి ధైర్యసాహసాలకు జోహార్లన్న వెంకయ్య
సూర్యాపేట షూటర్స్ ను మట్టుబెట్టిన నల్గొండ జిల్లా పోలీసుల ధైర్య సాహసాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కీర్తించారు. దుండగుల కాల్పుల్లో చావుబతుకుల మధ్య కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్ కౌంటర్ లో ముష్కరులను మట్టుబెట్టడంలో నల్గొండ జిల్లా పోలీసులు అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారన్నారు. నాగరాజు వీరమరణం పొందాడన్నారు. సిద్ధయ్యకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరుపై అనుచిత వ్యాఖ్యలు చేయరాదని ఆయన సూచించారు. ఈ కేసు దర్యాప్తులో తెలంగాణ పోలీసులకు అన్ని రకాలుగా సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు.