: ‘షూటర్స్’ను సజీవంగా కెమెరాలో బంధించి... తెలుగు పత్రిక ‘సాక్షి’ విలేకరి సాహసం!
‘సూర్యాపేట’ షూటర్స్ గా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన సిమి ఉగ్రవాదులను ఎట్టకేలకు నల్గొండ జిల్లా పోలీసులు బంధించారు. తుపాకులతో కాల్చేసి విగతజీవులుగా వారిని పట్టుకున్నారు. అయితే పోలీసుల కంటే ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఓ మండల స్థాయి విలేకరి సదరు ఉగ్రవాదులను సజీవంగానే తన కెమెరాలో బంధించేశాడు. అప్పటికే చేతిలో పిస్టల్, భుజాన కార్బన్ లతో కనిపిస్తే కాల్చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తూ కాలయముళ్లలా ఘీంకరిస్తున్న సదరు ఉగ్రవాదులను అర్వపల్లికి చెందిన విలేకరి శ్రీరంగం వెంకన్న తన కెమెరాలో బంధించాడు. తెలుగు దినపత్రిక ‘సాక్షి’కి విలేకరిగా పనిచేస్తున్న ఆయన నిన్న ఉగ్రవాదుల ఫొటోలు తీసిన సందర్భంగా మృత్యువు ముఖద్వారం వద్దకు వెళ్లి వచ్చారు. పోలీసుల చేతిలో హతం కావడానికి కాస్త ముందుగా అర్వపల్లిలో కదం తొక్కిన తమను ఫొటోలు తీస్తున్న వెంకన్నకు ఓ ఉగ్రవాది తుపాకీ గురిపెట్టాడు. ఈలోగా ఉగ్రవాది, వెంకన్నల మధ్యకు ఓ బస్సు వచ్చి ఆగడం, అదే సమయంలో తుంగతుర్తి సీఐ వాహనం రావడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంకన్న బతికిపోయారు.