: షూటర్లను 10 కి.మీ. మేర వెంటాడి నేలకొరిగిన కానిస్టేబుల్ నాగరాజు... వీరమరణమన్న నాయిని


జానకీపురంలో నేటి ఉదయం జరిగిన దోపిడీ దొంగల ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన కానిస్టేబుల్ నాగరాజు, ‘సూర్యాపేట’ షూటర్లను పది కిలో మీటర్ల మేర వెంటాడాడు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్న అక్రమ్, జకీర్ ల కోసం నల్గొండ జిల్లా పోలీసులతో పాటు ఆక్టోపస్ పోలీసులు కూడా మూడు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం అరవపల్లి మండలం సీతారామాపురం సమీపంలో షూటర్లు ఎస్సై సైదయ్య కంటబడ్డారు. ఈ క్రమంలో సైదయ్య, పోలీసు జీపు డ్రైవర్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగరాజు షూటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. కాల్పులు జరుపుతూనే పరుగు లంకించుకున్న దొంగలను నాగరాజు పది కిలో మీటర్ల మేర వెంటాడాడు. ఈ క్రమంలో తనవద్ద ఉన్న తుపాకీతో తూటాలు అయిపోయేదాకా కాల్పులు జరిపాడు. నాగరాజు వద్ద తూటాలు అయిపోవడం, అదే సమయంలో మూల మలుపు రావడంతో మాటు వేసిన షూటర్లు ఒక్కసారిగా నాగరాజుపై విరుచుకుపడ్డారు. దీంతో షూటర్ల బుల్లెట్లకు నాగరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కట్టంగూరు మండలం అయిటిపాములకు చెందిన నాగరాజుకు ఆరు నెలల క్రితమే వివాహమైందట. నాగరాజు మృతదేహానికి నివాళులర్పించిన తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నాగరాజు వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. వీరమరణం పొందిన నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News