: గ్రామస్థులను రక్షణ కవచంగా చేసుకుని తప్పించుకునేందుకు ‘సూర్యాపేట’ షూటర్స్ విఫలయత్నం!
సూర్యాపేటలో ఇద్దరు పోలీసులను కాల్చి చంపి, మరో ఇద్దరు పోలీసులను గాయపరచిన దోపిడీ దొంగలు తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరారు. అంతేకాక మూడు రోజులుగా సూర్యాపేట సమీపంలోనే మకాం వేసి, చాకచక్యంగా తప్పించుకునేందుకు యత్నించారు. అయితే, ఎన్ కౌంటర్ ఆపరేషన్ లో ఆరితేరిన ఆక్టోపస్ పోలీసుల చేతిలో వారు హతమయ్యారు. నేటి ఉదయం సినీ ఫక్కీలో జరిగిన ఎన్ కౌంటర్ లో జానకీపురం గ్రామస్థులను రక్షణ కవచంగా చేసుకుని తప్పించుకునేందుకు వారు చేసిన యత్నం ఫలించలేదు. పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే హతమయ్యారు. అయితే గ్రామస్థులను రక్షణ కవచంగా చేసుకున్న దోపిడీ దొంగలు పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా వారు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సీఐ బాలగంగిరెడ్డితో పాటు ఎస్సై సిద్ధీఖీ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. అంతేకాక పోలీసు వాహనం డ్రైవర్ నాగరాజును దోపిడీ దొంగలు పొట్టనబెట్టుకున్నారు. గాయపడ్డ సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.