: టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లికి గవర్నర్ పదవి?... ఫలిస్తున్న చంద్రబాబు మంత్రాంగం
నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులును గవర్నర్ పదవి వరించబోతోందని విశ్వసనీయ సమాచారం. టీడీపీ-బీజేపీల మధ్య మైత్రిలో భాగంగా ఈ మేరకు కేంద్రం మోత్కుపల్లి నర్సింహులును గవర్నర్ గా నియమించనుందని తెలుస్తోంది. నేడు ఢిల్లీ విందులో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ముందు ప్రతిపాదించనున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఏపీలో బీజేపీ ఎమ్మెల్యేలకు తన కేబినెట్ లో చోటు కల్పించిన చంద్రబాబు, నామినేటెడ్ పదవుల్లోనూ వారికి స్థానం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో కేంద్ర కేబినెట్ లో తమ పార్టీ ఎంపీలకు మంత్రి పదవులిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని, తమ నేతలకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలని కోరేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే, తమ పార్టీకి చెందిన దళిత నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఆయన నేటి విందులో ప్రధానిని కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ విషయంపై ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని కూడా తెలుస్తోంది. గవర్నర్ పదవిని టీడీపీ సూచించిన వ్యక్తికి ఇచ్చే విషయంలో బీజేపీ కూడా సానుకూలంగానే ఉన్నా, రాజకీయ నేత కానటువంటి వ్యక్తి (శాస్త్రవేత్త లేదా విద్యావేత్త) పేరును సూచించాలని చంద్రబాబును కోరిందట. అందుకు ససేమిరా అంటున్న చంద్రబాబు, మోత్కుపల్లికే గవర్నర్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, గతంలో రాజ్యసభ సీట్ల కేటాయింపు సందర్భంగానే చంద్రబాబు, మోత్కుపల్లికి గవర్నర్ పదవిపై హామీ ఇచ్చారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి త్వరలోనే గవర్నర్ పదవి చేపట్టడం ఖాయమేనన్న వాదన టీడీపీలో బలంగా వినిపిస్తోంది.