: ఇరాన్-ఇటలీ వాలీబాల్ మ్యాచ్ చూసి జైలు పాలైన యువతికి క్షమాభిక్ష
పురుషుల వాలీబాల్ మ్యాచ్ కు స్త్రీలు హాజరు కాకూడదన్న నిషేధంపై నిరసన వ్యక్తం చేసి జైలుపాలైన ఇరానియన్-బ్రిటన్ యువతి ఘోంచే గవామీకి ఇరాన్ కోర్టు క్షమాభిక్ష పెట్టినట్టు బ్రిటన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఆమెపై మోపిన అభియోగాలను కూడా తొలగించినట్టు చెప్పారు. "ఇరాన్ లోని కోర్టు గవామీకి క్షమాభిక్ష పెట్టడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే, ఇప్పటికీ ఆమె ప్రయాణానికి సంబంధించి నిషేధం ఉంది" అని బ్రిటన్ విదేశాంగ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. విచారణను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని, ఆమె కుటుంబంతో కూడా అందుబాటులో ఉంటామని చెప్పారు. గవామీ విషయం తెలిసిన ఆమె సోదరుడు ఇమాన్ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో "ఫ్రీ గవామీ" అంటూ సంతోషంతో పోస్టు చేశాడు. గతేడాది జూన్ లో టెహ్రాన్ ఆజాదీ స్టేడియం బయట నిరసన వ్యక్తం చేసిన గవామీనీ పోలీసులు అరెస్టు చేయగా, టెహ్రాన్ కోర్టు సంవత్సరంపాటు జైలు శిక్ష విధించింది. అయితే, ఆమె అభ్యర్థనపై కోర్టు నిర్ణయం పెండింగ్ లో ఉండగానే మూడు వారాలకే గవామీ బెయిల్ పై విడుదలైంది.