: యువకులపై నమ్మకం ఉంచండి... రైతులను ప్రోత్సహించండి: మోదీ
విద్య కోసం విదేశాలకు వెళతామనే యువకులపై నమ్మకం ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులకు సూచించారు. ముంబయిలో ఆర్బీఐ 80వ వార్షికోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులు బ్యాంకు రుణాలు తీర్చడమే కాకుండా, బ్యాంకుల్లో ఆదా చేస్తారని అన్నారు. మాతృభూమి రుణం ఎలా తీర్చుకోవాలో యువతరానికి బాగా తెలుసని చెప్పారు. రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని ఆయన బ్యాంకులకు హితవు పలికారు. రైతుల నుంచి రుణాలు రికవరీ చేసేప్పుడు కాస్త ఉదారంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని, రాబోయే 20 సంవత్సరాలకు సరిపడే రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆయన ఆర్బీఐకి సూచించారు. జన్ ధన్ యోజన కింద 14 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని ఆయన తెలిపారు.