: మలేసియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ నెంబర్ వన్ కిరీటాన్ని అధికారికంగా చేజిక్కించుకున్న సైనా ఈ టోర్నీలోనూ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తోంది. మహిళల సింగిల్స్ విభాగంలో చైనా క్వాలిఫయర్ ఝూ యావోతో జరిగిన పోరులో సైనా 21-13, 21-9తో సునాయాసంగా నెగ్గింది. క్వార్టర్ ఫైనల్లో సైనా చైనాకే చెందిన సున్ యు తో తలపడనుంది. అటు, పురుషుల విభాగం సింగిల్స్ లో పారుపల్లి కశ్యప్ కథ ముగిసింది. కశ్యప్ 10-21, 6-21తో చెన్ లాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక, మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల-అశ్వినీ పొన్నప్ప జోడీ 23-21, 8-21, 17-21తో ఇండోనేషియా జంట మహేశ్వరి, గ్రేసియా చేతిలో ఓటమిపాలైంది.