: సూర్యాపేట సీఐ శరీరంలో మూడు బుల్లెట్లు... బాధితులకు హోం మంత్రి పరామర్శ
సూర్యాపేటలో రాత్రి దోపిడీ దొంగల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సీఐ మొగులయ్య శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అర్ధరాత్రి సోదాలు చేస్తున్న పోలీసులపై మెరుపుదాడి చేసిన దోపిడీ దొంగలు ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడ్డ మొగులయ్య, మరో కానిస్టేబుల్ ను హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మొగులయ్య శరీరంలోని ఒక బుల్లెట్, మరో కానిస్టేబుల్ శరీరంలోని ఒక బుల్లెట్ ను వైద్యులు వెలికితీశారు. మొగులయ్య శరీరంలోని మరో రెండు బుల్లెట్లను వెలికితీసేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వారిద్దరికీ ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఘటనపై సమాచారం అందుకున్న తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మరో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి కిమ్స్ లోని బాధితులను పరామర్శించారు.