: ఐఏఎస్ శిక్షణలో కి‘లేడీ’... ఏడు నెలలుగా ముస్సోరి కేంద్రంలో తిష్ట!
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్... భావి ఐఏఎస్ లకు శిక్షణనిచ్చే కేంద్రంగా దేశంలో అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన సంస్థ. అందులోకి ప్రవేశించాలంటే, ఎవరైనా అన్ని ఆధారాలు చూపాల్సిందే. అయితే ఓ మహిళ, ఎలాంటి ఆధారాలు చూపకుండానే లోపలికెళ్లిపోయింది. తానూ ఐఏఎస్ కు ఎంపికయ్యానంటూ అక్కడి సెక్యూరిటీ అధికారులతో పాటు పాఠాలు చెప్పే ఉన్నతాధికారులను కూడా బురిడీ కొట్టించి, ఏకంగా ఏడు నెలల పాటు అక్కడే తిష్ట వేసింది. తీరా ఏడు నెలలు గడిచాక, సెక్యూరిటీ అధికారుల ప్రశ్నలతో వారి కళ్లుగప్పి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయింది. యావత్తు దేశాన్నే నివ్వెరపరచిన ఈ ఘటన గత నెల 27న వెలుగు చూసింది. వివరాల్లోకెళితే, ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా కుతాబీకి చెందిన రూబీ చౌదరీ అనే మహిళ గతేడాది సెప్టెంబర్ 20న అకాడెమీలో అడుగుపెట్టింది. ఉత్తరఖండ్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఐడీ కార్డుతో లోపలికి ఈజీగా ప్రవేశించిన ఆమె, ఆ తర్వాత తానూ ఐఏఎస్ కు ఎంపికయ్యానని ఒకసారి, కేంద్ర జౌళి శాఖలో ఉద్యోగినంటూ మరోసారి చెబుతూ ఐఏఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో కలిసి తరగతులకు హాజరైంది. సెక్యూరిటీ విభాగంలో పనిచేసే దేవ్ సింగ్ అనే ఉద్యోగి క్వార్టర్ లో ఏడు నెలల పాటు నిక్షేపంలా కాలం వెళ్లదీసింది. ఈ క్రమంలో అకాడెమీకి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఐఏఎస్ లతో కలిసి ఏకంగా ఫొటో కూడా దిగింది. తీరా సెక్యూరిటీ విభాగంలోని కొందరు అధికారులు ఆమె వివరాలడగగా, ఇక ప్రమాదం తప్పదని భావించి అక్కడి నుంచి చిన్నగా జారుకుంది. ఈ విషయం తెలిసి షాక్ తిన్న ముస్సోరీ కేంద్రం ఉన్నతాధికారులు రూబీకి వసతి కల్పించిన దేవ్ సింగ్ ను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే, ముస్సోరీ కేంద్రం సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సత్యవీర్ సింగ్ కు ఆమె స్వయానా కూతురని ఆలస్యంగా తెలిసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూతురుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవీర్ సింగ్, సెలవుపై వెళ్లారట.