: సూర్యాపేటలో దొంగల కాల్పులు...ఇద్దరు పోలీసుల దుర్మరణం, మరో ముగ్గురికి గాయాలు
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని హైటెక్ బస్టాండ్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపై దొంగలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డ్ మహేశ్ మృత్యువాత పడ్డాడు. ఈ కాల్పుల్లో సీఐ మొగులయ్యతో పాటు మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ రాత్రి 3 గంటల సమయంలో హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి తొలుత విషమంగానే ఉన్నా, ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. పోలీసులపై కాల్పులకు దిగిన అనంతరం ఖమ్మం మీదుగా పరారైన దొంగలు తమకు ఎదురుపడ్డ ఓ కారును ఆపి, అందులోని దంపతులపై కూడా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కారులోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన దొరబాబు గాయపడ్డారు. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో వరుసగా జరిగిన కాల్పుల ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్న నల్లగొండ జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రాత్రి నుంచే దొంగల కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతోంది. జిల్లా ఎస్పీ ప్రభాకరరావు స్వయంగా రంగంలోకి దిగారు. కాల్పులకు తెగబడ్డ దొంగలు ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఘటనా స్థలంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తికి చెందిన ఓటరు ఐడీ కార్డు లభ్యమైంది. దీంతో కాల్పులకు దిగింది యూపీ దొంగలా? ఒడిశాకు చెందిన దుండగులా? అన్న విషయంపై స్పష్టత రావడం లేదు. ఇక కాల్పుల అనంతరం దొంగలు సీఐ మొగులయ్య రివాల్వర్ తో పాటు మరో కానిస్టేబుల్ కు చెందిన తుపాకీని కూడా ఎత్తుకెళ్లారు.