: మరణశిక్షల్లో భారత్ కు టాప్ టెన్ లో చోటు
మరణశిక్షలు విధించే దేశాల్లో భారతదేశం టాప్ టెన్ లో చోటుదక్కించుకుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. 2014లో భారత న్యాయస్థానాల్లో 64 మందికి మరణశిక్ష విధించినా, ఆ ఏడాది భారత్ లో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదట. డెత్ పెనాల్టీ రిపోర్ట్ పేరిట ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓ నివేదికను విడుదల చేసింది. మరణశిక్ష తీర్పుల విషయంలో నైజీరియా (659), పాకిస్థాన్ (231), బంగ్లాదేశ్ (142), ఇండియా (64) మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. కాగా, 2013లో ఉరిశిక్ష అమలు చేయడంలో మెదటి ఏడు దేశాల్లో భారత్ స్థానం సంపాదించింది. 2013తో పోలిస్తే 2014లో ప్రపంచ వ్యాప్తంగా 28 శాతం మరణశిక్షలు పెరిగాయి. ఉరితీత అమలు మాత్రం 22 శాతం తగ్గింది. 2,466 మరణశిక్ష తీర్పులు వెలువడగా, 607 మంది ఉరితీయబడ్డారు. 607 మందిలో 72 శాతం మంది ఇరాన్, ఇరాక్, సౌదీఅరేబియా దేశాల్లో ఉరితీయబడ్డారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. బెలారస్, చైనా, వియత్నాం, సిరియా, ఉత్తర కొరియాల్లో ఉరిశిక్షలు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో నమోదవుతున్న మొత్తం ఉరిశిక్షల కంటే చైనాలోనే అత్యధిక ఉరిశిక్షలు నమోదవుతున్నట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంచనావేస్తోంది.