: మీడియా పర్యాటకులను భయపెడుతోంది: కాశ్మీర్ వ్యాపారులు
జమ్మూకాశ్మీర్ లో వరదల్ని మీడియా ఎక్కువ చేసి చూపెడుతోందని ఆ రాష్ట్ర వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ లో వారు మాట్లాడుతూ, మీడియా కారణంగా పర్యాటకులు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ పర్యాటక ఆధారిత రాష్ట్రమని వారు స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుందని, వరదలపై మీడియా ప్రసారం చేస్తున్న వార్తల కారణంగా పర్యాటకులు ఆందోళనతో రాష్ట్రానికి రావడం మానేశారని మండిపడుతున్నారు. మీడియా కథనాల కారణంగా 50 శాతం ముందస్తుగా బుకింగ్ చేసుకున్న టికెట్లు రద్దయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. మీడియా జమ్మూకాశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోందని వారు విమర్శించారు. గతేడాది వచ్చిన వరదల నుంచి ఇంకా తేరుకోలేదని తెలిపిన వారు, తాజా వరదలు తగ్గినా మీడియా వరదలపై కథనాలు ప్రసారం చేస్తూనే ఉందని మండిపడ్డారు.