: అలాంటి సంస్థలనే ఏపీలోనూ నెలకొల్పుతున్నాం: వెంకయ్యనాయుడు
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్య, వైద్య, సాంకేతిక, శిక్షణ సంస్థలు హైదరాబాదులోనే కేంద్రీకృతమయ్యాయనడం వాస్తవమేనని, అయితే, అలాంటి సంస్థలనే ఇప్పుడు ఏపీలోనూ నెలకొల్పుతున్నామని తెలిపారు. ఏర్పేడు మండలంలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ లకు శంకుస్థాపన చేశామని, ఐదేళ్లలో ఐఐటీ నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. శ్రీ సిటీలో 70 ఎకరాల స్థలంలో ట్రిపుల్ ఐటీ నిర్మిస్తున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలకు స్థల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. ఒక ప్రాంతానికి న్యాయం జరగకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయిందని అన్నారు. ఏపీకి తగిన న్యాయం చేసేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు ప్రారంభించిందని వెంకయ్య చెప్పారు. గత ఏడాదికి సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. సమగ్ర భూగర్భ మురుగు కాల్వ పథకం కింద విజయవాడకు రూ.461 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ విభాగం ద్వారా వెయ్యి కోట్లు విడుదల చేయాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా పొందామని చెప్పారు.