: మిస్ వరల్డ్ టైటిలే ప్రధానం... కానీ, బాలీవుడ్ ఆఫర్లను వదులుకోలేను: మిస్ ఇండియా
బాలీవుడ్ అవకాశాలు వస్తే వదులుకునేది లేదని మిస్ ఇండియా వరల్డ్-2015 అదితి ఆర్య తెలిపింది. 'మిస్ ఇండియా వరల్డ్' టైటిల్ సాధించిన తరువాత ఎవరి లక్ష్యమైనా మిస్ వరల్డ్ పై ఉంటుంది. కానీ, అదితి ఆర్య లక్ష్యం మాత్రం బాలీవుడ్ అన్నట్టు కనపడుతోంది. 'మిస్ ఇండియా' టైటిల్ గెలుచుకున్న అనంతరం అదితి మాట్లాడుతూ, ప్రస్తుతానికి తన దృష్టంతా మిస్ వరల్డ్ పైనే ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో బాలీవుడ్ అవకాశం వస్తే వదులుకోనని తెలిపింది. సినిమాల్లో నటించాలని తనకు ఆసక్తిగా ఉందని అదితి చెప్పింది. ఈ ఢిల్లీ అమ్మడు మనసులో మాట చెప్పేసిందిగా! ఇక బాలీవుడ్ వర్గాలదే ఆలస్యం! అయినా, అందగత్తెలను పరిచయం చేయడానికి బాలీవుడ్ ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. అయితే, మిస్ ఇండియాను తెరకు పరిచయం చేసేది ఎవరో మాత్రం తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.