: నేను చెప్పినట్లు చేయాల్సిందే... లేదంటే నీ సంగతి చూస్తా: జేసీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరంగం


మొన్న సంక్షేమ పథకాలకు గులాబీ రంగు, నిన్న ఏకంగా జిల్లా స్థాయి అధికారులకు బెదిరింపులు... టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ పరువును గంగలో కలుపుతున్నారు. ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లాలోనే ఈ రెండు ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సీడీ ట్రాక్టర్లు టీఆర్ఎస్ కార్యకర్తలకు చేరిపోతున్నాయన్న ఆరోపణలతో సదరు పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తాత్కాలిక నిషేధం విధించారు. ఇక నిన్న సాయంత్రం కలెక్టరేట్ లోకి చొచ్చుకువచ్చిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పై బెదిరింపులకు దిగారు. ‘‘నేను చెప్పినట్లు చేయాల్సిందే. లేదంటే నీ సంగతి చూస్తా. శిఖం భూమికి పట్టా ఇస్తావా?... లేదా?. నేను చెబితే కూడా ఫైల్ పక్కనబెట్టావ్. ఒక్కసారి చెబితే అర్థం కాదా?’’ అంటూ ఎమ్మెల్యే యాదగిరి, జేసీపై విరుచుకుపడ్డారు. రెవెన్యూ అధికారులతో భేటీలో ఉన్న జేసీపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన, అక్కడికి చేరుతున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో చిన్నగా జారుకున్నారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు భగ్గుమన్నారు. ఉద్యమంలో ఒక్క టీఆర్ఎస్ మాత్రమే పాల్గొందా? తాము లేకుంటే పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న టీఆర్ఎస్ నేతల బెదిరింపులను నిలువరించాల్సిందేనని వారు తీర్మానించారు.

  • Loading...

More Telugu News