: కేసీఆర్ కూడా అర్థం చేసుకోవాలి: జగన్
ఏపీ వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరుతున్నానని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఈ విషయంపై కేసీఆర్ పునరాలోచించుకోవాలని విన్నవించారు. ఢిల్లీలో జైట్లీతో సమావేశం అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలే ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడం లేదని... అలాంటప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటివి ఉండరాదని చెప్పారు. ఈ విషయాన్ని కేసీఆర్ అర్థం చేసుకోవాలని అన్నారు. ఒకే భాష మాట్లాడుతున్న మనం, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కలిసే ఉండాలని, అభివృద్ధి పథంలో పయనించాలని జగన్ అభిలషించారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని అన్నారు. రెండు రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి మరొకటి సంపాదించాలనే విధంగా ఆలోచించకూడదని చెప్పారు. ఏపీ వాహనాలపై ఈ అర్ధరాత్రి నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయాలని టీఎస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ అర్ధరాత్రి నుంచి అది అమల్లోకి రానుంది.