: నన్ను సానబట్టే క్రమంలో ఆయన బరువు తగ్గాడు!: సైనా
ప్రపంచ బ్యాడ్మింటన్ రారాణి సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచిన ఊపులో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన కోచ్ విమల్ కుమార్ ను ఆకాశానికెత్తేసింది. "వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు, ఇండియన్ ఓపెన్ విజయం క్రెడిటంతా విమల్ సర్ దే. నా శిక్షణ సమయంలో ఆయనెంతో శ్రమించారు. నన్ను సానబట్టే క్రమంలో విమల్ సర్ బరువు కూడా తగ్గారు. ప్రకాశ్ పదుకొనే సర్ సలహాలు కూడా ఉపకరించాయి. గతేడాది తొమ్మిదో ర్యాంకులో ఉండేదాన్ని. ఏడు నెలల్లో నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంటానని ఊహించలేదు. ఎంతో కఠోర ప్రస్థానం అది. అగ్రపీఠం అన్నది ప్రతీ షట్లర్ కల. దాన్ని సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొంది. తన తల్లిదండ్రుల గురించి చెబుతూ, తానిప్పుడు వరల్డ్ నెంబర్ వన్ ను అయినా... వారెంతో సామాన్యంగా ఉంటారని తెలిపింది. ఫోన్ చేస్తే, "అమ్మా... తిన్నావా?" అంటూ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారని చెప్పింది. అయితే, వాళ్లు తన ఘనత పట్ల సంతోషిస్తుంటారని తెలుసని పేర్కొంది.