: అనంత జిల్లాలో సొసైటీ సమావేశంలో ఘర్షణ... ప్రత్యర్థుల దాడిలో సొసైటీ చైర్మన్ దారుణ హత్య
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(కో-ఆపరేటివ్ సొసైటీ)లో కొద్దిసేపటి క్రితం ఘర్షణ చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. గడచిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి సొసైటీ చైర్మన్ గా విజయం సాధించిన భాస్కరరెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న క్రమంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. గొడవ జరుగుతుండగానే చైర్మన్ గదిలోకి ప్రవేశించిన ప్రత్యర్థులు భాస్కరరెడ్డిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ప్రత్యర్థుల దాడిలో భాస్కరరెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడుల్లో మరో పది మందికి గాయాలయ్యాయి.