: కూలీ కూతురు... టీచర్ పై న్యాయపోరాటం చేసి విజయం సాధించింది
కూలీ దంపతుల కుమార్తె తన టీచర్ పై న్యాయపోరాటం చేసి శిక్షపడేలా చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 2006లో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆ 13 ఏళ్ల బాలికను జి.పళనిస్వామి అనే టీచర్ ల్యాబొరేటరీలో లైంగికంగా వేధించాడు. అనంతరం, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలతో సహా, ఆమె స్నేహితురాలిని కూడా బెదిరించాడు. దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ కి బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులను కూడా సంప్రదించింది. వారు చర్యలు తీసుకోలేదు. దీంతో, న్యాయస్థానం ముందుకు వెళ్లింది. సుదీర్ఘంగా న్యాయపోరాటం చేసిన ఆ అమ్మాయి ఎట్టకేలకు విజయం సాధించింది. ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాధితురాలు, తనలా ఎవరైనా అన్యాయానికి గురైతే, వారికి అండగా నిలబడతానని తెలిపింది. కాగా, తిరువళ్లూరు న్యాయస్థానం కీచక టీచర్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.