: పోలవరం త్వరగా పూర్తి చేయాలని మోదీని కోరా: వైఎస్ జగన్
ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ఈ సాయంత్రం 4.30 గంటల సమయంలో పార్టీ ఎంపీలతో వెళ్లి మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోదీని కోరినట్టు చెప్పారు. పోలవరం, పట్టిసీమ గురించి ప్రధాని దృష్టికి తెచ్చానన్నారు. ఇక, ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో ఇబ్బందులున్నాయని మోదీకి తెలిపానన్నారు. నిల్వ సామర్థ్యం లేకుండా పట్టిసీమ కడుతున్నారని, టెండర్లు కోట్ చేశాక బోనస్ ఇస్తామనడం గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. ఇటు, రాయలసీమలో ఎన్నో ప్రాజెక్టులు మూలనపడ్డాయన్న జగన్, రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల గురించి కూడా భేటీలో ప్రధానికి వివరించానని పేర్కొన్నారు.