: ఎంఐఎం చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ: కిషన్ రెడ్డి
ఎంఐఎం పార్టీ చేతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలుబొమ్మగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలను అరెస్టు చేయడంలో చూపుతున్న ఉత్సాహం, ఇసుక మాఫియాలో హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై చర్యల విషయంలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సగం మంది టీడీపీ వారే ఉన్నారని చెప్పిన ఆయన, టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రివర్గంలో చోటిచ్చారని ఆయన విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని తరిమికొడతామని గతంలో చెప్పిన కెసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప, చేతల్లో చూపించడం లేదని ఆయన పేర్కొన్నారు.