: రాముడే మా ఇమామ్... అయోధ్య మాకు పుణ్యక్షేత్రం: వారణాసిలో ముస్లిం మహిళల మత సామరస్యం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ముస్లిం మహిళలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. రాముడే తమ ఇమామ్ అని, అయోధ్య తమకు పుణ్యక్షేత్రమని చాటుతున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని వారు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. విశాల్ భారతి సంస్థాన్ (వీబీఎస్) ఆధ్వర్యంలో వరుణనగర్ కాలనీలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముస్లిం మహిళలు రాముడిని స్తుతిస్తూ కీర్తనలు పాడారు. నజ్నీన్ అన్సారి అనే మహిళ మాట్లాడుతూ "శ్రీరాముడు మనందరికీ పూర్వీకుడు. ప్రపంచానికే ఆదర్శం. విద్వేషాన్ని పారదోలే ఏకైక నామధేయం ఇదే" అని పేర్కొన్నారు. హనుమాన్ చాలీసాను ఉర్దూలోకి తర్జుమా చేసిన నజ్నీన్, 'శ్రీరామ్ హారతి', 'శ్రీరామ్ ప్రార్థన' గీతాలను రచించారు. కాగా, నజ్నీన్ తదితరులు అయోధ్యలో రామమందిరం కట్టాలని ప్రధాని మోదీకి ఓ విజ్ఞాపన పత్రం కూడా పంపారు. అయోధ్య రాముడికి చెందినదని, దేశంలోని ముస్లింలు హిందువుల నుంచి గౌరవాన్ని కోరుకుంటున్నట్టయితే, రాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణానికి ముందుకురావాలని వారు పిలుపునిస్తున్నారు.