: కమల్ మనోభావాలకు కవితా రూపమిచ్చిన రామజోగయ్య శాస్త్రి
హైదరాబాదులో 'ఉత్తమ విలన్' సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా తన గురువు కె. బాలచందర్ పై తన ఆపేక్ష, అభిమానాన్ని కమల్ వినూత్న రీతిలో వ్యక్తపరిచారు. అయితే, తెలుగు ప్రేక్షకులకు తెలుగులోనే చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన తన మనోభావాలను గీతరచయిత రామజోగయ్య శాస్త్రితో చెప్పి ఓ కవిత రాయించారు. అది ఆయన మాటల్లోనే... మాలో కళయను ధాన్యపురాశి ధన్యత నొందగ దోసిట దూసి పైపై పొరల పొట్టును వలిచి మట్టిని రాళ్లను పక్కన విడిచి వల్లని దానిని జల్లెడ పట్టి విషయము మాత్రము పిడికిట పట్టి జనతా ప్రియమగు రుచిగా తేల్చిన పాక ప్రవీణా అహమూ గర్వము అడుగున అణచి అణకువగా మా కళను పొంగించి అభినయమను అరిటాకును పరచి ఇదివరకెరుగని విందుగ మమ్ముల జగతికి పంచిన సాంకేతిక నిపుణా సంతలో బేరము తిరుగ ముక్కలుముక్కలగా తెగనమ్మెడి సమయము నన్నొక బంగరు దుస్తును చెయ్యగ దర్జీ అవతారమెత్తిన గురూజీ మీరు మీ రుణమేనాటికి తీర్చగలను నన్ను కనుగొన్న నాన్నా ఇలపై ఇకపై మీలా ఎవరూ రారను మాటను తప్పని చెప్పగ అనుభవమంతా నేర్పించారు మీరే మేమే ప్రతిపని చెయ్యగ మీ వెలుగున తడిసిన పుడమికి పున్నమి గుబాళింపుగా రేటి కళాపూర్ణుడొకడు ఉదయించుట తథ్యము ఆ బాలచంద్రుడిని కడుపున పెంచి కళామతల్లికి అందించాలని వేచి చూస్తోంది రేపటి తరం వేనోళ్లుగా పిలుస్తోంది మా ఇంటి గర్భం విని వదిలేసే చిరు విషయముగా మిము మరచిన కాలము కదలదు ముందుకు ఆకసమంటిన శిఖరముగా మీ అంతులేని కథ విని కొనియాడగ ఇంటింట వెలిసేరు అభిమానులు తరగరుగాక శతకోటి తరములు నోరార మీ మాట స్మరియించు సమయాన వెయ్యింతలౌతుంది ఏ ఆయువైనా కనుమరుగైనా చెరగని కిటుకును సాఫల్య జీవన సరళిగా మాకందించిన దార్శనికులు పితృసమానులు మీరు చిరంతరంగా మీ యశస్సు వర్థిల్లాలని కోరుకుంటోంది మా గుప్పెడు మనస్సు... అంటూ ఆ కవితా పంక్తులు కమల్ కంఠ స్వరంలో గంభీరంగా సాగాయి.