: వాళ్లిద్దరితో పనిచేయలేను!: 'స్టింగ్ ఆపరేషన్'లో కేజ్రీవాల్


ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సాక్షాత్తూ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పైనే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేంతటి విభేదాలు చోటుచేసుకోవడం విశేషం. దీంతో అసమ్మతి నేతలు ప్రశాంత్‌ భూషణ్, యోగేంద్రయాదవ్‌ ల ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. నేటి సాయంత్రం జరగనున్న జాతీయ కౌన్సిల్ సమావేశంలో వారి ఉద్వాసనపై తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కాగా, కేజ్రీవాల్‌ పై చేసిన స్టింగ్ ఆపరేషన్ ఆడియో టేప్‌ యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ విడుదల చేశారు. ఈ టేపులో కేజ్రీవాల్ మాట్లాడుతూ, వారిద్దరితో కలిసి పనిచేయటం సాధ్యం కాదని అన్నారు. వాళ్లిద్దరూ పార్టీలో కొనసాగితే మిగిలిన 66 మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీని పెట్టుకుంటానని అన్నట్టు రికార్డైంది. ఈ ఆడియో టేప్ విని తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని, పార్టీ నుంచి సాగనంపాలని నిర్ణయించుకున్నాక చర్చలతో ప్రయోజనం లేదని వారు స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాగత సిద్ధాంతాలు, అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో కేజ్రీవాల్ రాజీపడుతున్నారని ఆరోపించిన వారు, పార్టీ నిర్ణయాల్లో కార్యకర్తల భాగస్వామ్యం పెరగాలని డిమాండ్ చేశారు. కాగా, ఆప్ లో విభేదాలపై దేశవ్యాప్తంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఎన్నుకుంటే పార్టీ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News