: బాబు వచ్చేవారం ఫుల్ బిజీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చేవారం ఫుల్ బిజీగా గడపనున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంపై స్పష్టతతో ఉన్న బాబు, అందుకు తగ్గట్టు కేంద్రంతోను, అంతర్జాతీయ సంస్థలతోనూ చర్చలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిధులు రాబట్టేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నేటి ఉదయం తిరుపతి చేరుకోనున్నారు. అక్కడ ఐఐటీ, ఐఐఎన్ఈఆర్, ఐఐఐటీ సంస్థల భవనాల నిర్మాణపనులకు శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి పట్టిసీమకు పయనం కానున్నారు. అక్కడ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన, బహిరంగ సభ, తుళ్లూరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవం, బహిరంగ సభల్లో ప్రసంగాలు చేయనున్నారు. రాత్రికి తిరిగి హైదరబాదు చేరుకుంటారు. సోమవారం, మంగళవారం ఏపీ రాజధాని నిర్మాణం నిమిత్తం సింగపూర్ లో నిర్వహించే ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పాల్గోనున్నారు. బుధవారం హైదరాబాదు చేరుకుని మంత్రి వర్గ సమావేశంలో పాల్గొంటారు. గురువారం కడప జిల్లా ఒంటిమిట్టలో జరగనున్న శ్రీరాముని కల్యాణోత్సవంలో గవర్నర్ తో కలిసి పాల్గోనున్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పెప్సికో ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. శనివారం ఢిల్లీ వెళ్లి అక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని ఇచ్చే విందులో పాల్గోనున్నారు. ఆదివారం గుంటూరులో సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) పార్క్ ప్రారంభిస్తారు.