: నావిగేషన్ వ్యవస్థను మెరుగుపరిచే ఉపగ్రహ ప్రయోగం నేడే
నావిగేషన్ వ్యవస్థను మెరుగుపరిచే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి27 (పీఎస్ఎల్ వీ) వాహక నౌకను నేటి సాయంత్రం నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ('షార్' అంతరిక్ష కేంద్రం) నుంచి ఇస్రో ప్రయోగించనుంది. ప్రయోగానికి ముందు జరిగే కౌంట్ డౌన్ కార్యక్రమం గురువారం ఉదయం 5.49 నిమిషాలకు ప్రారంభమై నిరాఘాటంగా కొనసాగుతోంది. 59.30 గంటలపాటు కొనసాగిన తరువాత వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దీని బరువు 1425 కేజీలు. ఇందులో ఇంధనం 821.5 కేజీలు కాగా, ఉపగ్రహం బరువు 603.5 కేజీలు. ఈ ఉపగ్రహం తయారీకి 125 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది ప్రకృతి విపత్తులను అంచనా వేయడానికి తోడు, షిప్ లు, విమానాలు వంటి వాహనాల రాకపోకలను గుర్తించడం వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' నావిగేషన్ వ్యవస్థ అభివృద్ధి కోసం 1400 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులతో ఏడు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతోంది. ప్రస్తుతం ప్రయోగిస్తున్న ఉపగ్రహం నాలుగోది కావడం విశేషం.