: ఇమ్మిగ్రేషన్ అధికారులా? శాడిస్టులా?
విమానాశ్రయాల్లో పనిచేసే ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశ పరువు ప్రతిష్ఠలు మంటగలిపే ప్రశ్నలు సంధిస్తూ పైశాచికానందం పొందుతున్న సంఘటన వెలుగుచూసింది. ఢిల్లీలో అంతర్జాతీయ విమానం ఎక్కేందుకు వెళ్లిన ఓ మహిళను చిత్రవిచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ లైంగికానందం పొందిన వైనం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ హాంకాంగ్ లోని తన భర్త వద్దకు వెళ్లేందుకు మార్చి 18న ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కి వెళ్లింది. అక్కడున్న వినోద్ కుమార్ అనే ఇమ్మిగ్రేషన్ అధికారి... నీకు పిల్లలెంతమంది? స్మోక్ చేస్తావా? చికెన్ తింటావా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావా? ఒక్కదానివే వెళ్తున్నట్టున్నావు... మజా చేయడానికేనా? నీ భర్త ఊర్లో లేనప్పుడు ఒక్కసారైనా వేరే వ్యక్తితో గడిపావా? నా ద్వారా మూడో సంతానాన్ని కంటావా? మీ ఆయన లేనప్పుడు కాల్ చేస్తా... నీ ఫోన్ నంబర్ ఎంత? అంటూ ఆమెను సతాయించాడట. ఒంటరి మహిళ అయిన ఆమె, అతని వేధింపులను పంటిబిగువున భరించి భర్తను చేరుకుంది. మార్చి 23న ఇండియా తిరిగొచ్చిన ఆమె, కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతనిని సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.