: అన్ని ఆసుపత్రులు యాక్సిడెంట్ బాధితులకు చికిత్స చేయాల్సిందే: బాంబే హైకోర్టు
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించేందుకు నిరాకరించడం తెలిసిందే. బాధితులు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా అక్కడి వైద్యులు పట్టించుకోరు. పోలీసు కేసుల భయంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వెనుకంజ వేస్తాయి. కార్పొరేట్ ఆసుపత్రులు తీరుమార్చుకోవాలంటూ సామాజికవేత్తలు ఎందరో ఎలుగెత్తుతున్నారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టు మహారాష్ట్ర సర్కారుకు తాజా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స చేసేలా చర్యలు తీసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు క్షతగాత్రులను చేర్చుకుని ట్రీట్ మెంట్ అందివ్వాలని జస్టిస్ వీఎం కనాడే, జస్టిస్ ఏఆర్ జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. 'గోల్డెన్ అవర్' గా భావించే తొలి గంటలో క్షతగాత్రులకు చికిత్స అందేలా, రైల్వే స్టేషన్లలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సమీర్ జవేరి అనే సామాజిక ఉద్యమకర్త పిల్ వేశారు. దానిపై విచారణ సందర్భంగా హైకోర్టు పైవిధంగా పేర్కొంది.